తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటుకి సిఎం ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ రెండు డిస్కంలు ఉండగా కొత్తగా మరొకటి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 

అయితే ఇది నిర్దిష్ట ప్రాంతాలకు కాకుండా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తున్న వ్యవసాయ కనెక్షన్స్, ప్రభుత్వ పాఠాశాలలు, వివిధ ఉచిత విద్యుత్ పధకం కింద లబ్ది పొందుతున్నవారినందరినీ ఈ డిస్కం పరిధిలో తీసుకు రావాలని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ వినియోగానికి ఎంత ఖర్చవుతోంది... ఇతర అవసరాలకు ఎంత ఖర్చు అవుతోంది. ఆదాయం సమకూరుతోందో స్పష్టంగా తెలుస్తుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

అలాగే రెండు డిస్కంలో అప్పులు, వడ్డీల భారం తగ్గించుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేసుకోవడం, ఖర్చులు తగ్గించుకొని ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. 

సచివాలయంతో సహా రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో కూడా సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ భారం తగ్గించుకోవచ్చని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. 

ఇకపై సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇందిర సోలార్ గిరిజన వికాస పథకం కింద రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాలలో సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని రాబోయే మూడేళ్ళలో కనీసం 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, కనీసం 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపు సెట్లను అందించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.