కేసీఆర్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ గురువారం బీఆర్కే భవన్లో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకి తుది నివేదిక సీల్డ్ కవరులో అందజేశారు. మొత్తం 1000 పేజీలతో ఈ నివేదిక తయారుచేశారు.
పీసీ ఘోష్ కమీషన్ 15 నెలల పాటు విచారణ జరిపి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న లేదా సంబంధం ఉన్న ప్రతీ పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన అధికారిని, ఇంజనీర్లని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ఈ ప్రాజెక్టుకి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన మాజీ సిఎం కేసీఆర్ని, మాజీ ఆర్ధిక, సాగునీటి శాఖల మంత్రి హరీష్ రావులకు కూడా నోటీసులు పంపి ప్రశ్నించి వాంగ్మూలాలు తీసుకున్నారు.
ఈ నివేదికని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టి దానిలో పేర్కొన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఈసారి శాసనసభ సమావేశాలలో కేటీఆర్, హరీష్ రావులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు.