18 ఏళ్ళ తర్వాత నెల ముందే తెరుచుకున్న సాగర్ గేట్లు

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఈరోజు నాగార్జున సాగర్ 26 క్రస్ట్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక కాంగ్రెస్‌ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

సాగర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్ధ్యం 590 అడుగులు, 312.04 క్యూసెక్కులు కాగా మంగళవారం ఉదాయానికి 586.60 అడుగులకు చేరింది. కనుక మంత్రులు 26 క్రస్ట్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

దాదాపు 18 ఏళ్ళ తర్వాత తొలిసారిగా నెల రోజులు ముందుగా నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు. భారత్‌ తొలి ప్రధాని నెహ్రూ హయంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నేటికీ చెక్కు చెదరలేదని. దీని ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 26 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని చెప్పారు. ఇన్నేళ్ళ తర్వాత తొలి సారిగా అన్ని  గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు.

అన్ని గేట్లు ఎత్తి ఒకేసారి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు కుటుంబాలతో సహా తరలివచ్చారు.