మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురూ కలిసి మంగళవారం ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో నాగార్జున సాగర్ బయలుదేరవలసి ఉంది.
కనుక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం గంటసేపు ఎదురుచూసినా రాకపోవడంతో తీవ్ర అసహనంతో తిరిగి వెళ్ళిపోయారు.
ఆయన వెళ్ళిన కొద్ది సేపటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలిగి వెళ్లిపోయారని తెలుసుకొని ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ అందుబాటులో లేకపోవడంతో ఆయన లేకుండానే బయలుదేరక తప్పలేదు.
ఇంకా ఆలస్యం చేస్తే సాగర్ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయి గేట్లపై నుంచి నీళ్ళు ప్రవహించే ప్రమాదం ఉండదని సాగర్ అధికారులు చెప్పడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేకుండానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కలిసి సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది.