సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శ్రవణ్ రావు పేరు ఏపీలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కూడా వినిపించడం విశేషం.
మద్యం కుంభకోణం కేసులో ఏపీ పోలీసుల నుంచి నోటీస్ అందుకున్న శ్రవణ్ రావు గురువారం మధ్యాహ్నం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులైన వరుణ్ పురుషోత్తం, బూనేటి చాణక్యలకు శ్రవణ్ రావు తన దుబాయ్ ఫ్లాటులో ఆశ్రయం ఇచ్చారు. వారు సుమారు రెండు నెలల పాటు తన ఫ్లాట్‌లో ఉన్నారని శ్రవణ్ రావు ఒప్పుకున్నారు.
ఉమ్మడి స్నేహితుల ద్వారా వారు తనకు పరిచయమయ్యారని చెప్పారు. అయితే ఈ మద్యం కుంభకోణం కేసుతో వారికి సంబంధం ఉందో లేదో తనకు తెలియదని శ్రవణ్ రావు చెప్పారు.
తాను దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు వారిరువురూ తన ఫ్లాట్‌లోనే ఉన్నారని శ్రవణ్ రావు చెప్పారు. తాను ఫోన్‌లో ట్యాపింగ్ కేసులో చిక్కుకున్నాక ముందస్తు బెయిల్ లభించేవరకు దుబాయ్‌లో ఉన్నానని అప్పుడే వారితో తనకు పరిచయం ఏర్పడిందని శ్రవణ్ రావు చెప్పారు.
మద్యం కుంభకోణం కేసుని పక్కన పెడితే, ఓ డీఎస్పీగా చేసిన శ్రవణ్ రావుకి దుబాయ్‌లో ఫ్లాట్ ఎలా సంపాదించగలిగారు? అంత డబ్బు ఎక్కడిది? అనే సందేహాలు కలుగక మానవు.