ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కోరుతూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుపుతున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు తుది తీర్పు వెల్లడిస్తూ ఈ పిటిషన్‌ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఉన్నప్పటికీ దానిని 2026లో జనగణన తర్వాత చేయాలని అదే చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనబడిందనే విషయం సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్‌కు గుర్తుచేస్తూ, ఈ విషయంలో జమ్ము కశ్మీర్‌తో పోల్చుకోవడం సరికాదని స్పష్టం చేసింది.