పార్లమెంటుని తాకిన బీహార్ ఎన్నికల వేడి

త్వరలో బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతుండటంతో కాంగ్రెస్‌-బీజేపి, ఎన్డీయే-ఇండియా కూటమిల మద్య రాజకీయాలు చాలా వేడెక్కాయి.

ఎన్నికలు దగ్గరపడుతుంటే ప్రత్యేక పునః సమీక్ష (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) (సర్) పేరుతో ఎన్నికల సంఘం బీహార్‌లో ఓటర్ల జాబితాలో లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తోంది. వారిలో కొందరికి అనేక ఓటర్‌ కార్డులు కలిగి ఉండటం, కొందరు విదేశీయులు స్థానిక రాజకీయ పార్టీలు, నాయకుల సాయంతో ఆధార్, ఓటర్, రేషన్ కార్డు వగైరా పొందారని ఎన్నికల సంఘం వాదిస్తోంది. కనుక అటువంటి నకిలీ ఓటర్లను గుర్తించి వారిని ఓటర్ల జాబితాలో నుంచి తొలగించేందుకు ‘సర్’ అనే పేరుతో సర్వే నిర్వహిస్తోంది.

దీనినే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీహార్‌లో బీజేపి, ఎన్డీయేకి ఎదురుగాలి వీస్తోంది కనుకనే బడుగుబలహీన వర్గాలకు చెందిన లక్షలమంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగిస్తోందని ఆరోపిస్తూ ఇండియా కూటమి సభ్యులు గత నాలుగు రోజులుగా పార్లమెంట్ సమావేశాలలో నిరసనలు తెలుపుతున్నారు. దీనిపై చర్చకు పట్టుబడుతున్నా కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నేడు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.  

సర్ పేరుతో మోడీ ప్రభుత్వం దళితుల ఓటు హాక్కుని లాగేసుకుంటోంది. ఇది రాజ్యాంగ విరుద్దం. ఇది డాక్టర్    బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అవమానించడమే అని  కాంగ్రెస్ ఎంపీ మానిక్కం టాగోర్ విమర్శించారు.

ఇండియా కూటమికి మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ, శివసేన (యుబీటీ)లకు చెందిన ఎంపీలు  ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్, టీఆర్ బాలు, సంజయ్ రౌత్, కళ్యాణ్ బెనర్జీ తదితరులు, రాజ్యసభ సభ్యులు జేబీ మాథర్, రంజిత్ రంజన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ పాల్గొన్నారు. తక్షణమే దీనిపై లోక్ సభలో చర్చకు కేంద్రం అంగీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.