తెలంగాణ బీజేపిలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు సీనియర్ నాయకులే. ఇద్దరూ ఎంపీలే. వారిలో బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కూడా. ఆ స్థాయిలో ఉన్న వారిద్దరి మద్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవలే ఇద్దరూ వేర్వేరుగా ప్రెస్మీట్ పెట్టి పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్నారు కూడా. తెలంగాణ బీజేపి అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన ఎన్ రామచందర్ రావు దీనిని చిన్న సమస్యగా కొట్టి పడేసినప్పటికీ, ఈ వివాదం పరిష్కరించడానికి బహుశః ప్రయత్నిస్తూనే ఉంటారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల కోసం ధిల్లీలో ఉన్న నిజామాబాద్ బిజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వీరిద్దరి మద్య జరుగుతున్న ఈ గొడవలపై స్పందిస్తూ, “ఈ సమస్య పరిష్కరించేందుకు ఓ న్యూట్రల్ కమిటీని ఏర్పాటు చేయాలి. వీలైతే మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు రాంచందర్ రావు ఇద్దరూ కలిసి వారితో మాట్లాడాలి. లేదా ఈ సమస్యని బీజేపి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి వారికే అప్పగించాలి,” అని అన్నారు.
ధర్మపురి అర్వింద్ ఘోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై కూడా స్పందిస్తూ,” ఆయన్ని పార్టీ సస్పెండ్ చేయలేదు. ఆయనే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన మళ్ళీ బీజేపిలోకి రావాలనుకుంటే ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మళ్ళీ పార్టీ సభ్యత్వం పొందవచ్చు,” అని అన్నారు.