బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా‘ది దేశ్‌భక్త్’ అనే న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో పలు అంశాల గురించి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా...
• 2029 సార్వత్రిక ఎన్నికలలో బీజేపి, కాంగ్రెస్ రెండు పార్టీలకు కలిపినా 150 సీట్లు మించి రావని, ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది.
• దేశంలో బీఆర్ఎస్, వైసీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె వంటి 13 ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఇవి ఏ కూటమిలో కలవకుండా ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేస్తుంటాయి. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం.
• గత ఎన్నికలలో చిన్న చిన్న తప్పులు, లోపాల కారణంగా 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాము. 14 స్థానాలలో 5,000 కంటే తక్కువ ఓట్లతో సీట్లు కోల్పోయాము. ఇటువంటి లోపాలను గుర్తించి సరిచేసుకొని వచ్చే ఎన్నికలలో గెలుస్తాం. తెలంగాణలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.
• ముందు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చాక అప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతాం.
• ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాలలో సమానంగా ఎంపీల సంఖ్య పెంచాలి. అయినా ఎంపీల కంటే నిత్యం ప్రజల మద్య ఉంటూ వారికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల సంఖ్య పెంచితే బాగుంటుంది.
• ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత వరకు మతం, భాష పేరుతో ప్రజలలో చీలికలు ఏర్పడవని దేశం బలంగా ఉంటుంది.
• హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడం సరికాదు.
• జనగణన, కులగణన ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్రం రిజర్వేషన్లపై విధానం ప్రకటిస్తే మంచిది.
• నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగలేదు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదు.