తెలంగాణలో 200 కోట్లు ఉచిత ప్రయాణాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం 2023, డిసెంబర్‌ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టింది. నిన్న (బుధవారం)నాటితో మొత్తం 200 కోట్లు ఉచిత ప్రయాణాలు జరిగాయి. ఇంత భారం ఆర్టీసీ భరించలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ. 358.79 కోట్లు చొప్పున 2025-26 బడ్జెట్‌లో రూ.4,305.49 కేటాయించింది. ఈ 19నెలల్లో మహాలక్ష్మి పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,671 కోట్లు భారం భరించి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.

ఈ పధకం ప్రవేశపెట్టక మునుపు రాష్ట్రంలో రోజుకి 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేవారు. ఇప్పుడు రోజుకి 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే రోజుకి 8 లక్షల మంది మహిళలు ఈ మహాలక్ష్మి పధకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నారు.  

ఈ సందర్భంగా నేడు హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.