ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు పంపారు. ఈ ఏడాది మార్చిలో ఛాతి నొప్పితో ధిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందారు. గత నెల ఉత్తరాఖండ్‌లో ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నప్పుడు వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. కనుక వైద్యుల సూచన మేరకు అవసరమైన చికిత్స, పూర్తి విశ్రాంతి తీసుకునేందుకు రాజీనామా చేస్తునట్లు పేర్కొన్నారు. 

జగదీప్ ధన్‌ఖడ్ రాజస్థాన్‌లో జాట్ సామాజిక వర్గానికి చెందినవారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన లా చదివి రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1989లో జనతాదళ్ పార్టీలో చేరి ఝున్‌ఝున్‌ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. నాటి ప్రధాని చంద్రశేఖర్ అయనకి పార్లమెంటరీ వ్యవహరాల సహాయ మంత్రి పదవి ఇచ్చారు. దివంగత ప్రధాని పీవీ నరసింహరావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ 1998లో రాజకీయాల నుంచి తప్పుకొని మళ్ళీ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008లో బీజేపిలో చేరగా 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2022లో ఎన్డీయే అభ్యర్ధిగా ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.