బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా అవమానకరంగా బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపిలో చేరి ఇంతకాలం బాగానే కాలక్షేపం చేశారు. కానీ పార్టీ అధ్యక్ష పదవి లభిస్తుందని ఆశపడితే బీజేపి అధిష్టానం అనూహ్యంగా రామచందర్ రావుకి ఆ పదవి కట్టబెట్టేసింది.
మరోపక్క కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌తో చిన్న మొదలైన యుద్ధం ఇప్పుడు పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. కనుక బిజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని కట్టడి చేయకపోతే ఈటల రాజేందర్ పార్టీ వీడాలనే ఆలోచనలో ఉన్నారు.
కానీ వేరే పార్టీలో చేరే బదులు సొంత పార్టీ పెట్టుకుంటే మంచిదని భావిస్తున్నట్రులు సమాచారం. కాంగ్రెస్, బీజేపి, బీఆర్ఎస్ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం లేకనే మూడు పార్టీల నేతలు ఆయా పార్టీలను అంటిబెట్టుకొని ఉన్నారని, తాను పార్టీ పెడితే మూడు పార్టీల నుంచి చాలామంది వస్తారని ఈటల రాజేందర్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల కవితకి కూడా ఓ రాజకీయ ఆశ్రయం చాల అవసరం. కనుక ఈటల రాజేందర్ పార్టీ పెడితే ఆమె కూడా వచ్చి చేరే అవకాశం ఉంటుంది.
ఈటల రాజేందర్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద తన అనుచరుడితో కొత్త పార్టీ పేరు (బహుజన జనతా సమితి) రిజిస్ట్రేషన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది.