కరీంనగర్‌లో బండి సంజయ్‌, ఈటల మద్య డిష్యూం డిష్యూం!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్లే ఒక జిల్లాలో ఒక పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఇమడటం చాలా కష్టం. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో బీజేపి ఎంపీలు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మద్య బహిరంగంగానే యుద్ధాలు జరుగుతున్నాయి.

ఇటీవల కరీంనగర్‌లో ఓ మాజీ కార్పొరేటర్ పేరు వంద కోట్లు విలువగల క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో వార్తలలో వినిపించింది. ఆయన వెనుక ఈటల రాజేందర్‌ ఉన్నట్లు బండి సంజయ్‌ మాట్లాడారు. దీని వెనుక ఎవరున్నా వారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బండి సంజయ్‌ తన వర్గానికి ఎక్కువ సీట్లు దక్కించుకునేందుకే ఈవిదంగా రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్‌ వర్గం ఆరోపిస్తోంది. 

బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా మీడియా సమావేశం నిర్వహించి, “సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో నాకు తెలుసు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ధిల్లీ పెద్దలకు పంపిస్తూనే ఉన్నాను.

నీలా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకునే మనిషిని నేను కాను. కరీంనగర్‌ జిల్లాలో నేను అడుగుపెట్టని గ్రామం లేదు. హుజురాబాద్‌ ఎన్నికలలో నేను ఓడిపోవటానికి కుట్రలు చేసిన వ్యక్తికి ఎంపీ ఎన్నికలలో గెలిచేందుకు నేను తోడ్పడ్డాను.

అయినా నాకు వ్యతిరేకంగా విషం కక్కుతున్నారు. జిల్లాలో నన్ను దెబ్బ తీస్తే నేను మాత్రమే నష్టపోను. పార్టీ కూడా నష్టపోతుందనిఆయనకు తెలియదా?” అని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపి అభ్యర్ధులు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ అభ్యర్ధులతో ఎలాగూ పోటీ పడక తప్పదు. కానీ అంతకంటే ముందుగా బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ వర్గాలు పరస్పరం పోరాడుకోక తప్పదు.