శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్ పదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను కూడా అలాగే మరో 5 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తాను,” అని అన్నారు.
దీనిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. “పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం పార్టీ విధానాలకు వ్యతిరేకం. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ఇటువంటి ఆలోచనలను, ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ సహించరు,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవి ఆశిస్తూ ఎదురుచూస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని ఆశపడ్డారు. హోంమంత్రి కావాలని మనసులో కోరిక బయటపెట్టారు కూడా.
కానీ ప్రభుత్వంలో ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నందున అవకాశం లభించలేదు. మంత్రి పదవి లభించక తీవ్ర అసహనంతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తనకు పదవి రాకుండా అడ్డుకున్నది సిఎం రేవంత్ రెడ్డే అని అనుమానిస్తున్నారు. అందుకే ఆయనపై అసహనం ఈవిదంగా ప్రకటించారనుకోవచ్చు.