తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో ఇంటిగ్రేటడ్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, “సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు వివక్షకు గురైతే, తెలంగాణ ఏర్పడి కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే బురద జల్లుతున్నారు.
అయన ఎంతో గొప్పగా చెప్పుకొని లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అయన అధికారంలో ఉండగానే క్రుంగిపోతే వారికి అది తప్పుగా అనిపించలేదు. కానీ జూరాల ప్రాజెక్టులో ఓ గేటు తాడు తెగితే రాద్దాతం చేశారు.
నేను ఈ సభాముఖంగా జిల్లా ప్రజలకు మాట ఇస్తున్నాను. రెండేళ్ళలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తాము. డిసెంబర్ 9కల్లా రాష్ట్రం అన్ని ప్రాజెక్టుల భూనిర్వాసితులకి పరిహారం చెల్లిస్తాము,” అని అన్నారు.
తమ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధికి అమలుచేస్తున్న కార్యక్రమాలను సిఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. కేసీఆర్ గొర్రెలు, బర్రెలు పంచిపెట్టి బడుగు బలహీనవర్గాల ప్రజలను ఎదగనీయకుండా చేశారు. కానీ మా ప్రభుత్వం వారు కూడా సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా ఎదిగేందుకు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాము. వారి కోసమే ఇటువంటి ఇంటిగ్రేటడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాము.
ఆర్టీసీతో ఒప్పందం చేయించి వెయ్యి బస్సులు మహిళల అధ్వర్యంలో నడిచేలా చేశాము. మహాలక్ష్మి పధకం ద్వారా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాము. శిల్పారామం వద్ద మహిళలకు 150 స్టాల్స్ ఏర్పాటు చేయించాం. మహిళల అధ్వర్యంలో వెయ్యి మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
మా ప్రభుత్వం మహిళల కోసం ఇంకా అనేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. అవన్నీ అమలైతే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవుతారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.