
ఇతర రాష్ట్రాలకు హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగించే సరుకు రవాణా ఇతర వాహనాలు నగరంలో ప్రవేశించకుండా నేరుగా వెళ్ళిపోయేందుకు అవుటర్ రింగ్ రోడ్ నిర్మించారు. అదేవిదంగా ఇతర రాష్ట్రాలకు హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్ళ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి రాకుండా నేరుగా సాగిపోయేందుకు అవుటర్ రింగ్ రైల్వేలైన్ ప్రతిపాదనలు సిద్దం చేశారు దక్షిణ మద్య రైల్వే స్టేషన్ అధికారులు.
తద్వారా రాష్ట్రం 8 నుంచి 10 జిల్లాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో అనుసంధానం కూడా అవుతాయి. కనుక ఆయా జిల్లాల ప్రజలు రాజధానికి రాకపోకలు సులువవుతాయి. దీని కోసం దక్షిణ మద్య రైల్వే అధికారులు రూ. 17,763 కోట్లు వ్యయంతో 508.45 కిమీ రైల్వేలైన్, రూ.15,964 కోట్లు వ్యయంతో 511.55కిమీ లైన్, రూ.12,070 వ్యయంతో 392.02 కిమీ రైల్వే లైన్ నిర్మాణానికి మూడు ప్రతిపాదనలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి సమర్పించారు.
ఈ ప్రతిపాదనలలో ఒక దానిని ఆమోదించి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గురువారం ఢిల్లీలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు.