కేటీఆర్‌ డ్రగ్స్: రేవంత్‌ సంచలన ఆరోపణలు

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణ చేశారు. నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్‌ దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ కేదార్ అనే వ్యక్తితో కలిసి డ్రగ్స్ తీసుకున్నారు. అయితే కొన్ని డ్రగ్స్ కలిపి తీసుకోవడం వలన డోస్ ఎక్కువై కేదార్ మరణించాడు. అతని మరణానికి సంబందించి పూర్తి నివేదిక మా ప్రభుత్వం వద్ద ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ నివేదికని శాసనసభలోనే ప్రవేశపెడతాం.

మద్యం తాగేవారు రెండు మూడు రకాల మద్యం కలగలిపి కాక్‌టెయిల్ పార్టీలు చేసుకుంటారని విన్నాను. కానీ డ్రగ్స్ కూడా కాక్‌టెయిల్ చేస్తారని వినడం మొదటిసారి. కనుక చాలా ఆశ్చర్యపోయాను. ఈ నివేదికపై చర్చించడానికైనా కేసీఆర్‌ శాసనసభకు వస్తారా? ఎందుకంటే నేను దీని గురించి కేటీఆర్‌తో చర్చించాలనుకోవడం లేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

కేటీఆర్‌ డ్రగ్స్ తీసుకుంటారని గతంలో కూడా సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించేవారు. అప్పుడు కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ, అయితే ఇద్దరం వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుందాము. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తేలిపోతుంది,” అని ప్రతి సవాలు విసిరేవారు. కానీ ఈసారి సిఎం రేవంత్ రెడ్డి తన వద్ద నివేదిక ఉందని, దానిని శాసనసభలో ప్రవేశ పెడతానని చెపుతున్నారు. కనుక ఈసారి కేటీఆర్‌ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.