
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, “ఇదివరకు నీటి వివాదాలపై చర్చించేందుకు రమ్మనమని కేంద్రం ఆహ్వానిస్తే కేసీఆర్ వెళ్ళలేదు.
ఇప్పుడు నేను వెళ్తే విమర్శిస్తున్నారు. నేను ఫామ్‌హౌస్‌కి వెళితే నీటి వివాదాలు పరిష్కారం కావు కదా? అయినా కేంద్రం చర్చలకు పిలిస్తే వెళ్ళడం తప్పేలావుతుంది? అయినా కేసీఆర్ ఎప్పుడూ నీళ్ళ వివాదాలపై పేచీలు పెట్టేవారు తప్ప ఒక్కసారైనా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారా? ఆయన చేయనిది నేను చేస్తే మెచ్చుకోవలసింది పోయి విమర్శిస్తున్నారు, “ అని విమర్శించారు.
కల్వకుంట్ల కవిత విమర్శలపై స్పందిస్తూ, “ఆమె తమ బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయంటారు. ఆమె అన్న కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించరు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటానని కేటీఆర్ అడుగుతుంటే కేసీఆర్ అంగీకరించరు.
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తామంటారు. మరోపక్క ఆమె న్న కేటీఆర్ రహస్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్‌ని రహస్యంగా కలిసివస్తారు. కనుక ముందు మీ ఇంటిని, పార్టీని చక్కదిద్దుకున్నాక మా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది,” అని సిఎం రేవంత్ రెడ్డి చురకలు వేశారు.