
ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో రాష్ట్రం రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కృష్ణా, గోదావరి నీళ్ళని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి అప్పగించేసి వచ్చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు కూర్చోమని చెప్పి మొదట దానిపైనే చర్చ జరిపారు.
బనకచర్ల ప్రాజెక్టు వలన ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసమే కట్టాలనుకుంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి దానిని అడ్డుకోలేకపోతున్నారు కనుకనే మేము పోరాడాల్సి వస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనని తక్షణం విరమించుకోవాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే న్యాయ పోరాటం చేస్తాము,” అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆమె బీసీ రిజర్వేషన్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తప్పు పట్టారు. తాను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ జారీకి మద్దతు ఇచ్చానని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు గుడ్డిగా దానిని వ్యతిరేకించి నవ్వులపాలయ్యారు. తీన్మార్ మల్లన్న నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ అది వారి విజ్ఞతకే వదిలేశాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.