కమిటీ ఏర్పాటు.. కుమ్మక్కే: హరీష్ రావు

బుధవారం ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖల మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర జలాశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో సమావేశమయ్యారు. 

నిన్న జరిగిన సమావేశంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వివాదాలు పరిష్కారమైపోతాయని ఎవరూ ఆశించలేదు. కానీ సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు.  

ఈ కమిటీలో కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల నిపుణులు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు ఉంటారు. వీరు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబందించి అన్ని సమస్యలకు ఉభయ రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సాధించేందుకు కృషి చేస్తారు. ఈ నెలాఖరులోగా కేంద్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ సభ్యుల పేర్లను సూచిస్తే వారితో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. 

ఈ సమావేశంపై బీఆర్ఎస్‌ పార్టీ ఊహించినట్లే తనదైన శైలిలో స్పందించింది. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ వద్దని, ఒకవేళ చర్చ పెడితే సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి మద్యలో వచ్చేస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి, సమావేశంలో ఈ ప్రాజెక్టుపై కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే దానిపై సంతకం పెట్టి వచ్చారు. 

రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము. ఇప్పుడు సంతకం చేసి స్వయంగా నిరూపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టమయింది,” అని హరీష్ రావు విమర్శించారు. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నది బీఆర్ఎస్‌ పార్టీయేనని నాగర్ కర్నూల్ కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి విమర్శించారు.  నీటి వివాదాలు, సమస్యలు పరిష్కరించుకునేందుకు కేంద్ర మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తే దీనిని స్వాగతించాల్సిన బీఆర్ఎస్‌ పార్టీ అప్పుడే రాజకీయాలు మొదలుపెట్టేసిందని మల్లు రవి విమర్శించారు.