
నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. కొద్ది సేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఓకే ఒక అంశం బనకచర్ల ప్రాజెక్టు గురించి తమ వాదనలు వినిపించగా, తెలంగాణ ప్రభుత్వం మొత్తం 13 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందుంచింది.
డిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాలకు తక్షణం అనుమతులు ఇవ్వాలి.
ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి సహకరించాలి.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకి అనుమతివ్వాలి.
ప్రాణహిత-చేవెళ్ళ సుజాల స్రవంతి ప్రాజెక్టుకి ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలి.
తుమ్మిది హత్తి వద్ద బ్యారేజ్ నిర్మాణం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చించి ఒప్పించాలి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కృష్ణా నదిపై ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం సహకరించాలి.
కృష్ణానదీ జలాలను ఏపీ ప్రభుత్వం వేరే బేసిన్‌కు తరలించకుండా కృష్ణా రివర్ బోర్డు కట్టడి చేయాలి.
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం కుడి కాలువ నుంచి నీటిని వేరే బేసిన్‌కు తరలించడం తక్షణం నిలిపివేయాలి.
శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి పధకాలని కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలి.
శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి నీటిని తీసుకుంటున్నందున విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. కనుక ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించాలి అని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.