తీన్మార్ మల్లన్నకి నోటీస్ జారీ

ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు నోటీస్ వచ్చింది. అయితే ఇది ఆ కేసులో కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో. 

ఆ బాధితులలో తాను కూడా ఒకడినని గతంలో తీన్మార్ మల్లన్న చాలాసార్లు చెప్పుకున్నారు. కనుక ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఆయనకు నోటీస్ పంపించి వాంగ్మూలం ఇచ్చేందుకు గురువారం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీస్ పంపారు. 

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 269 మంది బాధితుల వాంగ్మూలాలు రికార్డ్ చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ బాధితులలో బీఆర్ఎస్‌ పార్టీతో సహా అన్ని పార్టీల నేతలు, గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, ఫార్మా, ఐటి రంగంలో ప్రముఖులు, రియల్ ఎస్టేట్, బంగారు నగల వ్యాపారులు ఉన్నట్లు సిట్ పేర్కొంది.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఆయనని తీవ్రంగా వ్యతిరేకించేవారు. కనుక తన ఫోన్ ట్యాపింగ్ చేసి తన కదలికలపై నిఘా పెట్టేవారని తీన్మార్ మల్లన్న ఆరోపించేవారు. రేపు విచారణకు హాజరైనప్పుడు ఇదే విషయం సాక్ష్యాధారాలతో సహా సిట్ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.