గోవా గవర్నరుగా అశోక్ గజపతి రాజు

మాజీ ఎంపీ, మాజీ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుని గోవా రాష్ట్ర గవర్నరుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు విజయనగరం సంస్థానానికి చెందిన అశోక్ గజపతి రాజుని పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. మొదట ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఎంపీగా, తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగారు. 

అశోక్ గజపతి రాజు ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఎల్లప్పుడూ నిరాడంబర జీవితం గడిపేవారు. విజయనగరం జిల్లాలో వారికి వేలాది ఎకరాల భూములు, వందల కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాటిలో చాలా వాటిని పాఠశాలలకు, దేవాలయాలకు, ఆస్పత్రులకు కేటాయించారు. 

ఆయన పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కావాలనుకుంటే ప్రత్యేక విమానంలో ప్రయాణించగలిగేవారు. కానీ సొంత డబ్బుతో ఎకానమీ క్లాసులో టికెట్ కొనుకొని ప్రయాణిస్తుండేవారు. విమానాశ్రయంలో కూడా సాధారణ ప్రయాణికులతో పాటు క్యూలైన్లో నిలబడేవారు. 

ఒకసారి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ప్లాట్ ఫారం మీద ఆయన కుటుంబంతో రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు ఎవరూ ఆయనని గుర్తుపట్టలేదు. కానీ తర్వాత న్యూస్ పేపర్లలో ఆయన ఫోటో, ఆ వార్త వచ్చిన తర్వాత అందరూ ఆయన నిరాడంబరతకి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా చేసినా ఏనాడూ ఒక్క అవినీతి మరకలేకుండా రాజకీయాలలో కొనసాగుతున్నారు.   

విశాఖలోని ప్రఖ్యాత పుణ్య క్షేత్రం సింహాచలానికి ఆయన అనువంశిక ధర్మకర్త. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌. విజయనగరం పట్టణంలో వెలసిన పైడితల్లి అమ్మవారు వారి రాజకుటుంబానికి చెందిన ఆడపడుచు. నాడు రాజ్యం, ప్రజల కోసం ఆమె ప్రాణత్యాగం చేశారు. 

రాజకీయాలలో హుందాతనం, నిబద్దత, నిష్కళంక చరిత్ర కలిగిన అశోక్ గజపతి రాజు ఈ పదవి లభించడంపై టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా విజయనగరం ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.