మండలి ఛైర్మన్‌కి కల్వకుంట్ల కవిత పిర్యాదు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. మండలి మహిళా సభ్యురాలినైనా తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయని కనుక ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 

“బోనం ఎత్తుకున్న మహిళని అమ్మవారిగా భావించి పూజించే సంస్కృతి, సమాజం మనది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చూసి రాజకీయాలలో ప్రవేశించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆడబిడ్డలు ఎవరూ రాజకీయాలలోకి రావద్దని ఆయన కోరుకుంటున్నారా?వస్తే వారు భయపడి వెనక్కు వెళ్లిపోయేలా చేస్తారా?

నేను బీసీ రిజర్వేషన్స్ గురించి ఏడాదిన్నరగా పోరాడుతున్నాను. కనుక ఈ అంశంపై మాట్లాడేందుకు నాకు హక్కు ఉంది. ఒకవేళ తీన్మార్ మల్లన్నకి ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే ఈ అంశం గురించి మాట్లాడాలి తప్ప ఇలా అసభ్యంగా కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఎమిటి? కనుక అనుచితంగా వ్యవహరించినందుకు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని,” కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.