తీన్మార్‌ అనుచిత వ్యాఖ్యలు.. కవిత అనుచరులు దాడి

తెలంగాణలో రాజకీయాలలో నైతిక విలువలు, హుందాతనం నానాటికీ కనుమరుగవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్‌ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవితని ఉద్దేశించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

“బీసీలకు రిజర్వేషన్స్ వస్తుంటే ఆమె (కల్వకుంట్ల కవిత) ఒంటికి గులాల్ వేసుకొని ఎందుకు డాన్సులు చేస్తోంది?  మాకు ఆమె ఏమైనా రిజర్వేషన్స్ ఇప్పించారా? లేక ఆమె ఏమైనా బీసీనా?అసలు మాతో ఆమెకు ఏం సంబంధం? మాతో కంచం సంబంధముందా మంచం సంబంధముందా?” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఆమె అనుచరులు తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. తమ నాయకురాలిని అంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న సెక్యూరిటీ గార్డు తన తుపాకీతో గాలిలో కాల్పులు జరపడంతో వారు పారిపోయారు. 

అటు తెలంగాణ జాగృతి నేతలు, ఇటు మల్లన్న అనుచరులు పరస్పరం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.