హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌... హిందీ కబుర్లు

ఈరోజు హైదరాబాద్‌లో రాజ్య భాష (హిందీ) విభాగ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌  కళ్యాణ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని హిందీ భాష ఎందుకు నేర్చుకోవాలో చాలా చక్కగా చెప్పారు.  ఆయన మాట్లాడుతూ, “ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం హిందీని వ్యతిరేకిస్తున్నాయి. హిందీ వద్దంటూనే ఆ పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి.  

ఎవరికైనా తొలి ప్రాధాన్యం మాతృ భాషే. కానీ హిందీ నేర్చుకోవడం వలన దాని ప్రాధాన్యత తగ్గిపోయినట్లు కాదు.. మాతృ భాష ఉనికిని వదులుకుంటున్నట్లు కాదు. మాతృభాష మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం వరకు అయితే హిందీ భాష యావత్ దేశం అంతటా ఉంది. కనుక అది నేర్చుకోవడం వలన లాభమే తప్ప నష్టం ఏమీ లేదు కదా? పైగా స్వదేశంలోనైనా విదేశాలలోనైనా భారతీయులుగా మన ఐక్యతకి హిందీ భాషే నిదర్శనంగా ఉంటుంది. కనుక హిందీని ఓ వివాదంగా కాకుండా దేశ ప్రజలతో మనల్ని మనం జోడించుకునే భాషగా మాత్రమే చూడాలి. అలాగే ఉత్తరాది రాజకీయ పార్టీలు కూడా దక్షిణాది భాషల విశిష్ఠతని గుర్తించి గౌరవించడం నేర్చుకోవాలి,” అని పవన్‌  కళ్యాణ్‌ అన్నారు.