గురువారం సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదముద్ర వేసింది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాలలో బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ తీర్మానం చేసి ఆమోదం కొరకు కేంద్రానికి పంపింది. కానీ దానిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదు. మరోపక్క సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సూచన మేరకు ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర పంచాయితీ రాజ్ చట్టం-2018 సవరణ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. కానీ విద్య, ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్స్ పెంపుకు తప్పనిసరిగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు:
రాబోయే మార్చిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
ముందుగా 22,033 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ.
ప్రభుత్వోద్యోగుల పనితీరు, జవాబుదారీతనం, హాజరు పెంచేందుకు అవసరమైన సంస్కరణలు ప్రవేశపెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వివిద శాఖలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పనితీరుని సమీక్షించేందుకు వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించి రికార్డులలో భద్రపరచాలని ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన జిన్నారం, ఇంద్రేశం మునిసిపాలిటీల పరిధిలో చేర్చబోయే 18 గ్రామ పంచాయితీలను డీ లిస్టింగ్ చేసేందుకు ఆమోదముద్ర.
రాష్ట్రం ప్రైవేట్ విద్యాసంస్థలైన అమిటి (శంషాబాద్), సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ (భువనగిరి) విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదాకి ఆమోదముద్ర. అమిటీ యూనివర్సిటీలో తప్పనిసరిగా 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్ధులకు కేటాయించవలసి ఉంటుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 306 గోశాలలున్నాయి. వీటికి అదనంగా వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీలలో అత్యాధునిక గోశాలలు నిర్మించడానికి ఆమోదముద్ర.