ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ గురువారం ఉదయం యశోదా ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆస్పత్రికి వచ్చి కొన్ని పరీక్షలు చేయించుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, శరీరంలో సోడియం మోతాదు చాలా తక్కువగా ఉందని కనుగొన్న వైద్యులు రెండు రోజులు ఆయనని ఆస్పత్రిలో ఉంచి అవసరమైన చికిత్సలు చేసి పంపారు.

వారి సూచన మేరకు మళ్ళీ నిన్న ఆస్పత్రికి వచ్చి మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉన్నందున సాయంత్రం డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఆయన సతీమణి శోభ, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే హరీష్ రావు యశోదా ఆస్పత్రికి వచ్చి కేసీఆర్‌ని ఇంటికి తీసుకు వెళ్ళారు. 

బీఆర్ఎస్‌ పార్టీలో కల్వకుంట్ల కవిత వ్యవహారం ఇంకా అలాగే ఉంది. తాను పార్టీలోనే ఉన్నానని ఆమె చెప్పుకుంటున్నారు కానీ గులాబీ కండువా పక్కన పెట్టేసి కేసీఆర్‌ తప్ప మరొకరి నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే లేదని చెపుతున్నారు. కేసీఆర్‌ ఇంతవరకు ఆమె విషయంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమీషన్‌ విచారణ త్వరలో ముగుస్తుంది. ఈ నెలాఖరులోగా ఆ నివేదిక ప్రభుత్వం చేతికి వస్తే దాని ఆధారంగా కేసీఆర్‌, హరీష్ రావు తదితరులపై కేసులు నమోదుచేసే అవకాశం ఉంది.

మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా ముగుస్తోంది. కనుక కేసీఆర్‌ ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఆరోగ్య కారణాలతో పార్టీకీ, రాజకీయాలకు దూరంగా ఉండిపోతే బీఆర్ఎస్‌ పార్టీ చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో కేసీఆర్‌ పార్టీని చక్కదిద్దుకొని, కేసుల నుంచి బయటపడగలరా లేదా? అనే విషయం రాబోయే రోజుల్లో చూడవచ్చు.