కొండాపూర్ ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన సిఎం రేవంత్

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్‌ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్‌ని కలుపుతూ నిర్మించిన 1.2 కిమీ పొడవైన ఫ్లై ఓవర్‌ని సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దుదిళ్ళ శ్రీధర్ బాబు, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీల సమక్షంలో శనివారం ప్రారంభోత్సవం చేశారు.

దీంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల నుంచి వాహనదారులకు ఊరట లభిస్తుంది. ఓఆర్ఆర్ నుంచి నేరుగా కొండాపూర్, హఫీజ్ పేటకు వెళ్ళేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సులువుగా చేరుకోవచ్చు.  

హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ ప్రాంతాల నిత్యం రాకపోకలు సాగించేవారికి ఈ ఫ్లై ఓవర్‌ చాలా ఉపశమనం కలిగిస్తుంది. రూ.446.13 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ పొడవు 1.2 కిమీ కాగా వెడల్పు 24 మీటర్లు. ఇరువైపులా చెరో మూడు లేన్లతో సువిశాలంగా నిర్మించినందున వాహనాల రాకపోకలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.