మీడియాకు కేటీఆర్‌ వార్నింగ్.. అంతలోనే మహా దాడి!

ఫోన్ ట్యాపింగ్‌ కేసు విషయంలో తన గురించి కొన్ని మీడియా సంస్థలు, ఆ ముసుగులో కొన్ని రాజకీయ శక్తులు తనపై దుష్ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 

ఆ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫిలిం నగర్‌లో గల మహా టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయంపై రాళ్ళతో దాడులు చేశారు. కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్ల అద్దాలు ధ్వంసం చేసి, కార్యాలయంలోకి జొరబడి విధ్వంసం సృష్టించారు. కేటీఆర్‌పైనే దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌ని విచారణకు పిలవలేదు కానీ ఆయన పేరు మీడియాలో వినపడుతూనే ఉంది. కనుక ఆయన ఆగ్రహం చెంది వార్నింగ్ ఇవ్వడం సహజమే. 

కానీ బిఆర్ఎస్ కార్యకర్తలు పట్టపగలు హైదరాబాద్‌ నడిబొడ్డున ఓ మీడియా సంస్థపై ఈవిదంగా భౌతికదాడులకు దిగడంతో ఇప్పుడు అందరి ముందు ఆయన తల దించుకోవలసి వస్తోంది. ఈ దాడి బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని మరింత దిగజార్చుతుంది. 

ఈ దాడిపై కేటీఆర్‌ వెంటనే స్పందించారు కానీ గట్టిగా ఖండించి ఉండి ఉంటే ఇది ఆయనకు తెలియకుండా జరిగిందని అందరూ భావించేవారు. 

కానీ ‘ప్రజాస్వామ్యంలో భవతిక దాడులకు తావు లేదంటూ’ మొక్కుబడిగా ఖండిస్తూ, “బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం ఆవేదన నేను అర్దం చేసుకోగలను. కానీ ఈ విషయంలో మనం న్యాయపోరాటం చేయబోతున్నాము కనుక అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుతున్నాను. 

దురదృష్టవశాత్తు డబ్బుతో పట్టుబడిన థర్డ్ రేట్ దొంగ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నపుడు , ఇటువంటి అబద్దాలు, దుష్ప్రచారం ఈనాటి దిగజారుడు రాజకీయాలలో ప్రాధాన్యత కల్పించారు... ఈ గుంపు మేస్త్రి అతని అనుంగు మిత్రులు. కానీ మనం కాంగ్రెస్‌ 420 హామీలపై నిలదీయడంపైనే దృష్టి సారిద్దాం,” అని మెసేజ్ పెట్టారు.