ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు బాధితులకు నోటీసులు పంపించి వారి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. బీజేపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులలో ఒకరు.
కనుక శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యి కేసీఆర్ హయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టం చేశారు. దానికి సంబందించిన వివరాలన్నీ వారికి తెలియజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను పోలీసులకు పిర్యాదు చేస్తే తిరిగి నాపైనే వేరే అక్రమ కేసులు నమోదు చేశారు. అప్పుడే ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్ళగా వారు కూడా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గుర్తించారు. కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఇప్పటికైనా ఈ కేసులో బాధితుల వాంగ్మూలాలు తీసుకొంటుండటం చాలా సంతోషం. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ జైలుకి పంపించాల్సిందే. అప్పుడు భవిష్యత్ మళ్ళీ ఎవరూ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సాహసించరు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కేంద్రం సాయం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం,” అని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు.