తెలంగాణ ప్రభుత్వంపై సెబీకి హరీష్ రావు పిర్యాదు

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై సెబీకి పిర్యాదు చేశారు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి ఆటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.10,000 కోట్లు అప్పు తీసుకోవడం సెబీ నిబంధనలను ఉల్లంఘించడమేనని దానిలో హరీష్ రావు పేర్కొన్నారు. ఆ రుణం మంజూరు చేయించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తిత్వ కంపెనీకి రూ.169.83 కోట్లు చెల్లించిందని తెలిపారు.   

ఈ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని అటవీ భూమిగా గుర్తించి నివేదిక ఇచ్చిందని, ఆ భూములలో పచ్చటి చెట్లను నరికివేసినందుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని హరీష్ రావు తన పిర్యాదులో పేర్కొన్నారు. 

తెలంగాణ ఐఐసీకి ఏడాదికి రూ.150 కోట్లు కంటే తక్కువే ఆదాయం ఉన్నప్పటికీ, ఈ భూములను బ్యాంకులో తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పులు తీసుకోవడం సెబీ నిబందనల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. 

కనుక అటవీ భూమిని తాకట్టుపెట్టి తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులో నుంచి రుణం తీసుకోవడంపై సెబీ విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.       

తెలంగాణ ప్రభుత్వం ఈ భూములను తనఖా పెట్టి తీసుకున్న రూ.10,000 కోట్ల అప్పుని తిరిగి నెలసరి వాయిదాలలో చెల్లిస్తుండాలి. అది అసలు వడ్డీ కలిపి సుమారు రూ. 200 కోట్లు వరకు ఉందని సమాచారం. కనుక ఐసీఐసీఐ బ్యాంకుని ఒప్పించి కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేస్తే కనీసం రూ.25,000 కోట్లు ఆదాయం వస్తుందని, దాంతో బ్యాంకు అప్పు తీర్చేసి, మిగిలిన సొమ్ముని ప్రభుత్వం నిర్వహణ, సంక్షేమ పధకాలకు ఖర్చు చేయవచ్చని ప్రభుత్వం భావించింది. 

దానిపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెపుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకే సాగి ఆ భూములలో పచ్చటి చెట్లను నరికించడం మొదలుపెట్టింది. వెంటనే బిఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసి అడ్డుకుంది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు హరీష్ రావు లేఖపై సెబీ స్పందించి చర్యలు తీసుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారవచ్చు.