అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పనిచేస్తున్న ‘నార్కోటిక్ బ్యూరో’ పేరుని ‘ఈగల్’గా మార్చుతున్నట్లు ప్రకటించి దాని కోసం ప్రత్యేకంగా రూపొందించిన (గద్ద బొమ్మ)లోగోని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నిర్మాత ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు పాల్గొన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయక్కరలేదు. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు ఆ దేశం సర్వనాశనం అవుతుందని ఎక్కడో చదివాను. అది నూటికి నూరు శాతం నిజం. మన దేశం కూడా ఇప్పుడు ఇటువంటి ప్రమాదాన్నే ఎదుర్కొంటోంది.
రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, కొనుగోలుని ఈ ఈగల్ వ్యవస్థ ఉక్కుపాదంతో అణచివేస్తుంది. ఇకపై రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అమ్మినా, కొనుగోలు చేసినఅ, వాడినా జైలుకి పంపిస్తాము. ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఇప్పుడు చక్కటి చదువులు, ఉద్యోగాలు అందుబాటులో ఉండగా మాదక ద్రవ్యాలకు అలవాటు పది జీవితాలు పాడు చేసుకుంటుండటం చాలా బాధ కలిగిస్తోంది. కనుక యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ, “ఒకప్పుడు నేను మా స్కూల్ తరపున ఇటువంటి అవగాహన కార్యక్రమాలకు హాజరవుతుండేవాడిని. అప్పటికి నాకు పిల్లలు లేరు. కానీ ఇప్పుడు తండ్రినైన తర్వాత స్కూలు బయట డ్రగ్స్ అమ్ముతున్నారనే వార్తలు విన్నప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నాను.
సిఎం రేవంత్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలని అభినందిస్తున్నాను. విద్యార్ధులు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి. యువత చక్కగా నచ్చిన పని చేసుకుంటూ సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగే ఇటువంటి కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతుంటాను. మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే మళ్ళీ బయటపడటం చాలా కష్టం కనుక వాటికి దూరంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, “మళయాళ సినీ పరిశ్రమలో ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తున్నారు. ఇక్కడ మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా అలా చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా త్వరలో నేను సినీ ప్రముఖులతో దీని గురించి మాట్లాడుతాను,” అని అన్నారు.