ఎఫ్-1 రేసింగ్ కేసులో ఇటీవల (జూన్ 16) మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఏసీబీ నోటీస్ జారీ చేసి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో ఆనాడు కేసీఆర్ హయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన అరవింద్ కుమార్‌కి కూడా మళ్ళీ ఏసీబీ నోటీస్ పంపింది.
జూలై 1వ తేదీన విచారణకు హాజరవ్వాలని నోటీసులో కోరింది. ప్రస్తుతం విదేశాలలో ఉన్న ఆయన ఈ నెలాఖరులోగా హైదరాబాద్ తిరిగి రానున్నారు. కనుక రాగానే ఏసీబీ విచారణకు హాజరు కావలసి ఉంటుంది. ఈసారి కేటీఆర్ చెప్పిన వివరాల ఆధారంగా ఆయనని ప్రశ్నించి మనీ లాండరింగ్ ఏవిదంగా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదో లొట్టిపీసు కేసని కేటీఆర్ తేలికగా కొట్టిపడేసినప్పటికీ, ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తూ ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను పట్టించుకోకుండా నేరుగా విదేశంలోని ఓ రేసింగ్ కంపెనీకి డబ్బు పంపడం ఆర్ధిక నేరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుకనే ఈ కేసు ఇంకా కొనసాగుతోంది. లేకుంటే న్యాయస్థానం ఎప్పుడో కొట్టివేసేది. కనుక ఇప్పుడు విచారణలో అరవింద్ కుమార్ ఏం చెప్తారో? చూడాలి.