తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏడాది జనవరి 30తో గ్రామ పంచాయితీల గడువు ముగియగా ప్రభుత్వం నేటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా అధికారులతో పని కానిచ్చేస్తోందని సర్‌పంచ్‌లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. జస్టిస్ మాధవీదేవి వాటిపై విచారణ జరిపి బుధవారం తీర్పు చెప్పారు.
బీసీ రిజర్వేషన్స్ ఖరారు చేయగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని దీనికి మరో నెల గడువు కావాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ అభ్యర్ధించారు. పంచాయితీల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే వెంటనే ఎన్నికల సంఘం రంగంలో దిగి నెలరోజులలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది జి. విద్యాసాగర్ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కనుక పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్లే!