ఆమ్రపాలి మళ్ళీ తెలంగాణకు?

కొన్ని నెలల క్రితం ఆంధ్రాకు పంపించబడిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి మళ్ళీ తెలంగాణకు తిరిగొచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఆదేశం మేరకు ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళి అక్కడ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా చేస్తున్నారు. కానీ ఆమె అప్పుడే తనని ఆంధ్రాకి బదిలీ చేయడంపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో సవాలు చేస్తూ పిటిషన్‌ వేశారు. దానిపై మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్ ఆమె వాదనలతో ఏకీభవిస్తూ, తిరిగి ఆమెను తెలంగాణకు బదిలీ చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆమెని ఆంధ్రాకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ కూడా క్యాట్ రద్దు చేసింది. 

కానీ ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే క్యాట్ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఇక వివాదం వద్దనుకుంటే క్యాట్ తీర్పు అమలుచేస్తూ ఆమెను తిరిగి తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చు.