ఫోన్ ట్యాపింగ్: ఎవరికీ మినహాయింపు లేదట!

కేసీఆర్‌ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ అధికారులు విచారణ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు అనేకం బయటపడుతున్నాయి. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు అత్యధికంగా 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వారిలో వివిద పార్టీల రాజకీయ నాయకులు, సినీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందినవారున్నట్లు గుర్తించారు. 

వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి రహస్యంగా వింటూ వారి ఆర్ధిక లావాదేవీల గురించి తెలుసుకొని, అకస్మాత్తుగా వారిపై ఏసీబీ లేదా పోలీసుల చేత దాడులు చేయించి ఆ సొమ్ము స్వాధీనం చేసుకునేవారని సిట్ అధికారులు కనుగొన్నారు. 

బాధితులలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఉండటం విశేషం. అంటే కేసీఆర్‌ వారూ వీరూ అని తేడా లేకుండా అందరి ఫోన్లని ట్యాపింగ్ చేయించి వారిని దెబ్బ తీసేవారని స్పష్టమవుతోంది. 

అయితే సిట్ అధికారులు విచారణ పూర్తి చేసి, బలమైన సాక్ష్యాధారాలతో ఛార్జ్-షీట్‌ ఫైల్ చేసి నేర నిరూపణ చేయగలిగితేనే ఈ ప్రక్రియ అర్ధవంతంగా ఉంటుంది. కానీ అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారి ఈ కేసు ఆటకెక్కించేస్తే, ప్రజలు నమ్మకం కోల్పోతారు. ఇటువంటి కేసులు, విచారణలు అన్నీ రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టి లొంగదీసుకోవడం కోసమే తప్ప నిజంగా నేరం చేసిన వారిని శిక్షించేందుకు కాదనే అభిప్రాయం మరింత బాలపడుతుంది.