అధికారం లేకపోతే కేసీఆర్‌ బయటకు రారా? కాంగ్రెస్‌ ప్రశ్న

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని పార్టీలు తమ తమ కార్యాలయాలలో, జిల్లా కేంద్రాలలో అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రాలేదు!

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆమెరికా, లండన్ యాత్రలో ఉన్నందున అక్కడే ప్రవాసులతో కలిసి అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.

కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’తో సొంత కుంపటి మళ్ళీ రాజేసుకుంటున్నారు. కనుక ఆమె బంజారాహిల్స్‌లో కొత్తగా ప్రారంభించుకున్న తన కార్యాలయంలోనే సొంత జెండాతో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు జరపుకున్నారు.

పార్టీలో సీనియర్ అయిన హరీష్ రావు కూడా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. కానీ ఆ వార్త పెద్దగా రాలేదు. ఈవిదంగా పార్టీలో నలుగురు కీలక నేతలు నాలుగు దిక్కులన్నట్లు ఉండటంతో పార్టీ శ్రేణులు చాలా నిరుత్సాహపడ్డాయి.

ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ రావునే కల్వకుంట్ల కవిత ట్రబుల్ మేకర్ అన్నట్లు నిందిస్తుండటంతో ఆయన హడావుడి బాగా తగ్గింది. 

బిఆర్ఎస్ పార్టీలో ఈ ఉదాసీనతని  ప్రజలు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించింది. అందుకే ప్రభుత్వం విప్ ఆదివారం శ్రీనివాస్ స్పందిస్తూ, “కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి, చేతిలో అధికారం ఉంటే తప్ప తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలలో కూడా పాల్గొనరా?అధికారంలో ఉన్నప్పుడే గుర్తుంటుందా? లేకపోతే ఉండదా?

శాసనసభ సమావేశాలకు ఎలాగూ హాజరు కావడం లేదు. కనీసం అవతరణ దినోత్సవం వేడుకలకైనా హాజరు కావాలి కదా? పదవి, అధికారం ఉంటేనే ప్రజల మద్యకు వస్తామని లేకుంటే లేదన్నట్లు కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు,” అని విమర్శించారు.