కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావులను జూన్ 5, 6, 9 తేదీలలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపగా, అందుకు సిద్దమని తెలిపిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 5న వేరే కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉన్నందున మరో రోజున వస్తానని తెలియజేశారు.
ఆయన అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని మరో నోటీస్ పంపింది. ఈటల రాజేందర్, హరీష్ రావు ఇద్దరూ కమీషన్ని గడువు కోరనందున వారు ఈ నెల 6,9 తేదీలలో విచారణకు హాజరు కావలసి ఉంటుంది.
ఈటల రాజేందర్ ఇందుకు సిద్దంగా ఉన్నానని ఇదేవరకే ప్రకటించినందున జూన్ 6న ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ సమయం కోరినందున హరీష్ రావు కూడా సమయం కోరుతూ లేఖ వ్రాసే అవకాశం ఉంది.
జస్టిస్ పీసీ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ బుధవారం సాయంత్రం కోల్కత్తా నుంచి హైదరాబాద్ చేరుకొని, గురువారం నుంచి విచారణ ప్రారంభిస్తారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ల విచారణ పూర్తయితే ఈ నెలాఖరులోగా కమీషన్ తుది నివేదిక తయారుచేసి సిఎం రేవంత్ రెడ్డికి అందించే అవకాశం ఉంది.