నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని జాతీయ జండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా జపాన్ దేశంలో కితకితక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ముఖ్యమంత్రి ప్రసంగంలో తమ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను వివరించారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపి, బిఆర్ఎస్ పార్టీల కార్యాలయాలలో ఆయా పార్టీల సీనియర్ నేతలు జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ సాధనలో తమ తమ పార్టీల పాత్ర, కృషిని ప్రజలకు గుర్తుచేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో జాతీయ జెండాతో బాటు తెలంగాణ జాగృతి జెండా కూడా ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ సిఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.సోషల్ మీడియాలో ఆయన తరపున ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం మాత్రం కనబడింది.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో డల్లాస్ నగరంలో తెలంగాణవాసులతో కలిసి ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు.