కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారా?

ప్రముఖ తెలుగు దిన పత్రిక, న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ సంచలన వార్త ప్రచురించింది. బిఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్న కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తే ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వచ్చి చేరుతానని కాంగ్రెస్‌ అధిష్టానం ముందు ఓ ప్రతిపాదన ఉంచారని పేర్కొంది. 

కాంగ్రెస్‌ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ, సిఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్‌ అధిష్టానం వెనక్కు తగ్గిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది. 

కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సంప్రదించారనేందుకు తమ వద్ద ఖచ్చితమైన సాక్ష్యాధారాలున్నాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది. 

దీనిపై ఆమె వెంటనే “కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా?” అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ క్లిప్పింగ్ ఫేక్ న్యూస్ అని ఎక్స్‌ వేదికగా స్పందించారు. 

కానీ ఆంధ్ర జ్యోతి కూడా వెంటనే స్పందిస్తూ, తమ ప్రతినిధులు ఆ వార్తని ధృవీకరించుకునేందుకు కల్వకుంట్ల కవితకు ఫోన్‌ చేస్తే ఆమె స్పందించలేదని పేర్కొంది. 

ఇది ఆమె రాజకీయ జీవితంలో చాలా కీలకమైనది కనుక వివరణ ఈయవలసి వస్తుందనే భయంతోనే ఆమె స్పందించి ఉండకపోవచ్చని ఆంధ్ర జ్యోతి పేర్కొంది. 

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు, తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై తిరిగి వచ్చిన తర్వాత ఆమె కార్యాచరణ, తండ్రికి వ్రాసిన లేఖ బయటపడిన తర్వాత జరిగిన రాయబారాలు, అవి విఫలం అయ్యాక ‘సింగరేణి జాగృతి’ని ఏర్పాటు చేయడం వంటివన్నీ వివరిస్తూ నేటి సంచికలో ఓ కధనం ప్రచురించింది. కనుక కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయమేనని పేర్కొంది.