బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తండ్రి, అన్నతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారా? అంటే అవునంటున్నారు బీజేపి ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవిత సామాజిక తెలంగాణ అంటూ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న హడావుడి చూస్తుంటే, బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జూన్ 2న సొంత పార్టీ పెట్టుకోబోతున్నారనిపిస్తోంది.
పార్టీలో తనకు అన్యాయం జరిగిన తర్వాత ఆమెకు సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. మరి ఆనాడు మంత్రిగా ఉన్న బీసీ బిడ్డ ఈటల రాజేందర్ని కేసీఆర్ ఆర్డరరాత్రి మెడ పట్టుకొని బయటకు గెంటేసినప్పుడు కల్వకుంట్ల కవిత అది తప్పని తండ్రికి చెప్పి ఉంటే బాగుండేది.
తెలంగాణలో పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జ్యోతీరావు ఫూలే విగ్రహం పెట్టాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు సచివాలయంలో ఫూలే విగ్రహం పెట్టాలంటూ సంతకాల సేకరణ అంటూ డ్రామా చేస్తున్నారు. మీ కుటుంబంలో గొడవలు వచ్చి బయటకు వస్తేనే మీకు సామాజిక తెలంగాణ గుర్తొచ్చిందా?” అంటూ సూటిగా ప్రశ్నించారు.