దసరాకి కొమురవెల్లి స్టేషన్‌ రెడీ: కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఖైరతాబాద్, హిమాయత్ నగర్‌, బగ్గీఖానా బస్తీలలో పర్యటించి ప్రజలని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బగ్గీఖానా బస్తీలో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న ఆసక్తి హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై లేదు. హైదరాబాద్‌ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు.. పాతబస్తీ కూడా. 

ఇక్కడ తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటే సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా అందాల పోటీలకు హాజరావుతున్నారు. ఇకనైనా పాతబస్తీని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. పాత బస్తీ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. 

ఆపరేషన్ సింధూర్‌ గురించి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్న మాటలు మన జవాన్లని అవమానిస్తున్నట్లే ఉన్నాయి. వారు ప్రాణాలు పణంగా పెట్టి పాక్‌కు బుద్ధి చెప్పి పాక్‌ ప్రభుత్వం మన ముందు మోకరిల్లేలా చేస్తే సాక్ష్యాధారాలు చూపమని అడుగుతుండటం సిగ్గుచేటు. 

రాష్ట్రంలో యాదవ సంఘాల నాయకులు నన్ను కలిసి కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మించాలని కోరారు. ఈ విషయాన్ని నేను ప్రధాని మోడీకి చెప్పగా ఆయన ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే ఒకే చెప్పేశారు. ఈ ఏడాది దసరా పండుగ నాటికి కొమురువెల్లి  రైల్వే స్టేషన్‌ భక్తులకు అందుబాటులోకి వస్తుంది,” అని అన్నారు.