జూన్ 20: ప్రభాకర్ రావుకి డెడ్ లైన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుని జూన్ 20వ తేదీలోగా కోర్టులో హాజరు కావాలని లేకుంటే తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడుగా పరిగణించి తగు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నాంపల్లి పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌, తారామతిలో ఆయన నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులకు నోటీస్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు ఆ నోటీస్ అంటించి తిరిగి వచ్చారు.

ప్రభాకర్ రావు కూడా హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు సిద్దంగానే ఉన్నారు. కానీ పోలీసులు తనని అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేయగా దానిని కొట్టివేసింది. కనుక అరెస్ట్‌ భయంతో ఆయన అమెరికా నుంచి హైదరాబాద్‌ తిరిగి రాకపోవచ్చునని పోలీసులు భావించి నాంపల్లి కోర్టు ద్వారా ఈ నోటీస్, ఉత్తర్వులు జారీ చేయించారు. 

ఒకవేళ ప్రభాకర్ రావు గడువులోగా కోర్టులో హాజరు కానట్లయితే కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.