హరీష్ రావు ఇంటికి కేటీఆర్‌.. రెండు గంటలు భేటీ!

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈరోజు కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్ళి సుమారు రెండు గంటలు భేటీ అయ్యారు. హరీష్ రావు తండ్రి అనారోగ్యంతో ఉన్నందున ఆయనని పరామర్శించేందుకే కేటీఆర్‌ వెళ్ళినట్లు బిఆర్ఎస్ పార్టీ చెపుతున్నప్పటికీ, హరీష్ రావు ఇంట్లో కేటీఆర్‌ రెండు గంటలు గడపడం వారిరువురూ ఏకాంతంగా మాట్లాడుకోవడంపై ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్‌ స్పందించారు. 

“బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ముగ్గురి మద్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై పార్టీలో వారే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని, వారెవరో పార్టీలో అందరికీ తెలుసునని, వారిపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవలే కల్వకుంట్ల కవిత అన్నారు. కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తనకు అభ్యంతరం లేదని ఇటీవలే హరీష్ రావు చెప్పినప్పటికీ ఆయన కొత్త పార్టీ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కేటీఆర్‌ హటాత్తుగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి ఆయనతో రెండు గంటలు భేటీ అవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అది వారి పార్టీ అంతర్గత సమస్య అయినప్పటికీ వీరి ముగ్గురి మద్య ఏం జరుగుతోందో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనుక హరీష్ రావు లేదా కేటీఆర్‌ తమ రహస్య భేటీ దేనికో వివరించాలి,” అని రామచంద్ర నాయక్‌ అన్నారు.