మంత్రులు కమీషన్స్ ఎంత తీసుకుంటారో చెప్పమ్మా!

మంత్రి కొండా సురేఖ ఈరోజు వరంగల్‌లో జూనియర్ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రులు డబ్బు తీసుకొని తమ వద్దకు వచ్చే ఫైల్స్ క్లియర్ చేస్తుంటారని, కానీ తాను పైసలు ఆడగనన్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అప్పుడే ఆమె చెప్పిన ఈ మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే అవినీతి అని విమర్శలు గుప్పిస్తోంది. 

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ, “మంత్రి కొండా సురేఖగారూ.. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారని చెప్పి ఊరుకుంటే ఎలా? ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో చెప్పవచ్చు కదా? కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో మునిగి తెలుతోందని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి?

ఇది వరకు బిఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడి లక్షల కోట్లు స్వాహా చేసేస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కమీషన్లు గుంజుకొని అవినీతికి పాల్పడుతోంది.,” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

మంత్రి కొండా సురేఖా నోరు జారానని గ్రహించి, తాను కాంగ్రెస్‌ మంత్రుల గురించి అనలేదని, బిఆర్ఎస్ హయంలో మంత్రుల గురించి అన్నానని, కానీ మీడియా తన మాటలను వక్రీకరించిందని అన్నారు. 

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివని మా వాదనలను మంత్రి కొండా సురేఖ ధ్రువీకరించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.