భారత్‌ ఆర్మీకి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు: రాహుల్

‘ఆపరేషన్ సింధూర్‌’ విజయవంతంగా పూర్తి చేసిన భారత్ దళాలకు దేశంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నాయి.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌ ఆర్మీకి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ‘ఆపరేషన్ సింధూర్‌’ విజయవంతంగా పూర్తిచేసినందుకు వారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇదే అంశంపై ఈరోజు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశమై చర్చించాము. కేంద్ర ప్రభుత్వం రేపు (గురువారం) అఖిల పక్ష సమావేశంలో పాల్గొనవలసిందిగా మా పార్టీని ఆహ్వానించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ ప్రతినిధులు తప్పక హాజరయ్యి కేంద్ర ప్రభుత్వానికి మా పార్టీ తరపున తగిన సూచనలు, సలహాలు చెప్తాము,” అని అన్నారు. 

మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తలకు మువ్వనెల తలపాగా చుట్టుకొని ఈరోజు హైదరాబాద్‌, పాతబస్తీలో ఓ సభ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్‌ నిర్వహించిన భారత్‌ దళాలను అభినందించారు. భారత్‌ ఆర్మీకి మజ్లీస్ పార్టీ తరపున సంఘీభావం ప్రకటించారు. అనంతరం పాకిస్థాన్‌ ముర్దాబాద్.. భారత్‌ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.