ఊహించినట్లే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో బుధవారం తెల్లవారుజామున 1.44 గంటలకు త్రివిధ దళాలు కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిష్ట వేసిన ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో ఆర్మీ, వాయుసేన బాంబులు, క్షిపణుల వర్షం కురిపించి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ప్రధానంగా జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులలో పురుషులను వారి భార్యల ముందే అతి కిరాతకంగా కాల్చి చంపి వారి నుదట బొట్టు చెరిపేశారు గనుక ఆ మహిళల ప్రతీకారానికి నిదర్శనంగా ఈ ఆపరేషన్‌కి ‘సింధూర్’ అని పేరు పెట్టారు.
తమపై భారత్ దాడి చేస్తే ధీటుగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ పాలకులు, ఆర్మీ అధికారులు ఊహించని విదంగా భారత్ త్రివిద దళాలు మెరుపు వేగంతో దాడి చేసి తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోయాయి. ఈ విషయం తెలుసుకొని వారు ఎంతగా రగిలిపోతుంటారో ఊహించుకోవచ్చు.
కనుక పాక్ వాయుసేన దాడికి ప్రయత్నిస్తే తిప్పి కొట్టేందుకు భారత్ వాయుసేన సిద్దంగా ఉంది. సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలు, యుద్ధ వాహనాలు, సామాగ్రి సిద్దం చేసుకొని భద్రత మరింత పెంచారు.