చెప్పుల దొంగలు ఎవరు? బండి సంజయ్‌ ప్రశ్న

తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందన్నట్లు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా తప్పు పట్టారు. “కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే ఎవరైనా అందరికీ చెప్పుకొని పరువు తీసుకుంటారా? రేవంత్ రెడ్డి తాను కుటుంబ పెద్దనని చెప్పుకుంటూనే కుటుంబం పరువు తీసేశారు. ఎన్నికలలో అనేక వాగ్ధానాలు చేసి ఇప్పుడు రాష్ట్రం దివాళా తీసిందన్నట్లు మాట్లాడటం, ప్రభుత్వాన్ని నడపలేక చేతులు ఎత్తేయడం సిగ్గు చేటు. 

రేవంత్ రెడ్డి నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. వెళ్ళినప్పుడల్లా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబందించిన అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో చర్చించామని చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఢిల్లీలో తనకు ఎవరూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని అబద్దాలు చెప్పడం దేనికి? ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో చెప్పుల దొంగలు ఎవరు?

సాక్షాత్ ముఖ్యమంత్రి రాష్ట్రం దివాళా తీసిందన్నట్లు మాట్లాడుతుంటే పెట్టుబడిదారులకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించలేదా? కాంగ్రెస్‌ హామీలను నమ్మి ఎన్నికలలో గెలిపించి అధికారం అప్పగించిన సామాన్య ప్రజలు ఆందోళన చెందరా?

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరో కూలచేస్తారని చెపుతుంటారు. కానీ ఇప్పుడు ఆయనే ప్రభుత్వాన్ని నడపలేక చేతులేత్తేశారు కదా? రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాటలపై రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్ నేతలు, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు స్పందించాలి,” అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.