మంగళవారం అర్ధరాత్రి నుంచి టిజిఎస్ ఆర్టీసీ నిరవధిక సమ్మె ప్రారంభించేందుకు ఉద్యోగులు సిద్దం కాగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఐకాస నేతల చర్చలు ఫలించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మంత్రితో సమావేశం ముగిసిన తర్వాత ఐకాస నేతలు మీడియాతో మాట్లాడుతూ, “మా సమస్యలపై మంత్రిగారు సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి ముగ్గురు ఐఎస్ఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కనుక కమిటీ నివేదిక ఇచ్చేవరకు వేచి చూస్తాము. ఒకవేళ అప్పుడు కూడా ప్రభుత్వం మా సమస్యలని పరిష్కరించకుండా తాత్సారం చేస్తే మళ్ళీ సమ్మె తేదీ ప్రకటిస్తాము,” అని అన్నారు.
టిజిఎస్ ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు, రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, వేతన సవరణ, విద్యుత్ బస్సుల కొనుగోలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారని ఐకాస నేతలన్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతోంది. కనుక ఒకవేళ ఆర్టీసీ సమ్మె మొదలయ్యి ఉండి ఉంటే ఇంకా ఇబ్బంది పడేది. కానీ చివరి నిమిషంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఐకాస నేతలను ఒప్పించి సమ్మె విరమింపజేయడం ప్రభుత్వానికి చాలా వపశమనం కలిగించేదే!